Online Puja Services

నాయనార్ల గాథలు - అరివత్త నాయనారు

3.138.138.202

నాయనార్ల గాథలు - అరివత్త నాయనారు | Nayanar Stories - Arivattaya Nayanar 
లక్ష్మీ రమణ 


త్యాగం దైవిక గుణం. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అది రాజమార్గం. అసురీ భావాలని త్యాగం చేసి, దైవికమైన గుణ సంపత్తిని పెంచుకోవడం వలన పరమాత్మకు దగ్గరవుతాం అనడంలో సందేహం లేదు. బలి చక్రవర్తి, వచ్చినవాడు విష్ణువని,తన సర్వస్వాన్ని కోరేందుకే వచ్చాడని తెలిసినా, లోభ , మోహ ప్రలోభాలకు లొంగిపోలేదు. వాటిని త్యజియించి భగవంతుని సన్నిధినే పెన్నిధిగా ఎంచుకున్నారు. శిబి చక్రవర్తి ఒక పావురానికి కాపాడతానని తానిచ్చిన మాట కోసం, తన శరీరాన్ని కోసి తక్కెటలో వేశాడు. ఈ త్యాగమే ఆయన్ని భగవంతుని అనుగ్రహానికి పాత్రమయ్యేలా చేసింది.  ఇటువంటి ఎందరెందరో మహానుభావుల చరితలు త్యాగమే జీవిని ఈశ్వరునికి చేరువచేసే మార్గమని స్పష్టం చేస్తున్నాయి. తాను నమ్మి, ఆచరించిన విధానంలో త్యాగధనుడై ఈశ్వరుణ్ణి చేరుకున్న ఒకానొక భక్తుడు అరివత్తయ నాయనారు. 

భగవంతుని పైన అచంచలమైన నమ్మకం, భక్తి ఉండాలేగానీ, దాని మార్గం ఏమిటని ఈశ్వరుడు ప్రశ్నిస్తారా ? అలా ప్రశ్నిస్తే , కన్నప్ప పెట్టిన మాంసపు ముక్కలు తిని , ఆయన్ని అనుగ్రహించేవారా ? గుడగూచి తెచ్చిన పాలని స్వీకరించానని సాక్ష్యం చెప్పేవారా ? ఈశ్వర కృప ఊహకి కూడా అందని దివ్యానుభూతి. ఆ స్వామిని చేరుకోవడానికి జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు.  ఈశ్వరార్పణ బుద్ధితో ఏ కొంచెం త్యాగం చేసినా ఆయన అపారమైన అనుగ్రహానికి నోచుకోవచ్చని నిరూపించిన నాయనారు అరివత్తయ నాయనారు(తాయనారు) . 

 ఈశ్వరునికి కులమతాల పట్టింపు ఉండదని, ఆయన పట్టించుకునే కులం కేవలం భక్తి కులమేనని నాయనార్ల కథలు స్పష్టం చేస్తాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని కన్నమంగళం పట్టణంలో,  వెల్లాల కులంలో జన్మించారు తాయనారు.   తాయనారుకి ఐశ్వర్యానికి లోటులేదు.  కొండంత దేవుడు అరుణాచలేశ్వరుడు స్థిరమై ఉన్న ప్రాంతమేమో, ఆయనకి ఆ ఈశ్వరుని మీద అమితమైన భక్తి విశ్వాసాలు స్థిరమయ్యాయి. నిత్యమూ ఇంట్లో శివారాధనలు చేసేవారు.  శివాలయాలని సందర్శిస్తూ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వర్తించేవారు.  ప్రత్యేకించి, శ్రేష్ఠమైన బియ్యంతో ఈశ్వరునికి అన్నం వండించి, పాలకూర, ఆవకాయతో నివేదన చెయ్యడం ఈయన పూజలో ఒక విధానంగా పాటించేవారు.  ఆ భక్తుని ఉద్దేశ్యం శివునికి శ్రేష్ఠమైన పదార్థాన్నే నివేదించాలి అనే సిద్ధాంతం కావచ్చు. 

ఈశ్వరుడు తాయనారు భక్తి  అనే పుత్తడి వెలుగును  ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్నారు. పుత్తడికి పుటం పెడితేనే కదా , దాని ప్రకాశం బయటపడేది. తానే స్వర్ణకారుడై తాయన్నారు భక్తికి పుటం పెట్టడం  మొదలు పెట్టారు.

 ఈశ్వర లీలా విలాసంగా తాయనారు తన సంపదలని కోల్పోయారు. పెద్ద రాజమహలు వంటి ఇంటి నుండీ ఆయన మకాం పూరిగుడిసెకు మారింది. ఇల్లు గడవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో కూలి  కుదిరారు తాయనారు.  ఇంత వ్యక్తిగత, ఆర్ధిక ఇబ్బందుల్లోనూ ఈశ్వరునికి శ్రేష్ఠమైన బియ్యంతో వండిన అన్నం , పాలకూర,  ఆవకాయతో కూడిన   నివేదన మాత్రం మానలేదు.  భార్య భర్తలు పస్తులున్న, ఈశ్వర నివేదనకు లోటు రానివ్వలేదు. తాయనారు భార్య పెరట్లోనే పాలకూర పండించి నివేదన తయారు చేస్తే, కూలికి కుదిరినప్పుడు నివేదనకు   అవసరమైన బియ్యం ప్రతిఫలంగా లభిస్తే, చాలనుకునేవారు తాయనారు. ఆ విధంగా భార్యాభర్తలు ఈశ్వరుని నివేదనని సమకూర్చడమే పరమావధిగా జీవిస్తూ ఉన్నారు.  

ఇదిలా ఉండగా, ఒకనాడు తాయనారు ఈశ్వర నివేదనకు సర్వం సమకూర్చుకొని ఆయా పదార్థాలని నివేదించడానికి పూజాస్థలికి తీసుకువెళుతూండగా కళ్ళు తిరిగి పడిపోయారు.  తన గురించి ఆలోచించకుండా కేవలం మంచినీళ్ళతో కడుపు నింపుకొని, పనిచేస్తూ  ఉండడం వలన ఆయనకొచ్చిన స్థితి అది.  ఆ స్థితిలో కూడా తాయనారు “ అయ్యో ! ఈశ్వరునికి నివేదించాల్సిన పదార్థాలు చేజారి నేలపాలయిపోయాయే” అని బాధపడ్డారు. ఈశ్వరాపరాధం జరిగిపోయిందని, ఈశ్వరునికి తిరిగి నివేదన తయారుచేయడానికి తగిన సంబారాలు లేవని తల్లడిల్లిపోయారు.  కనీసం లేచి నిలబడలేని పరిస్థితిలో, దుఃఖంతో ఆర్తిగా ఆ ఈశ్వరుణ్ణి పిలుస్తూ, తలుస్తూ, ఈశ్వరపరాథం చేశానని వగస్తూ ఉండిపోయారు. ఈ అపరాధానికి తనను తాను అంతం చేసుకోవడమే పరిష్కారమని / సరైన శిక్షని తలపోశారు. కొడవలితో తన తలని ఉత్తరించుకోబోతుండగా ఒక అద్భుతం జరిగింది . 

తాయనారుకి  కరకరా అని ఆవకాయ ముక్కని కొరికిన చప్పుడు వినిపించింది. దానికి తోడు  “పాలకూరలో ఈ ఆవకాయ నంజుకుంటే చాలా బాగుంది” అనే మాటలు వినిపించాయి.  కన్నులు తెరిచిన  తాయనారుకి ఈశ్వరుడు అమ్మతో కలిసి తాను మట్టిపాలయ్యాయనుకున్న పదార్థాలని ఆరగిస్తూ కనిపించారు. 

మహదానందపడిపోయారు తాయనారు. ఈశ్వర కృపకి కన్నులనుండీ ధారాపాతంగా ఆనందభాష్పాలు వర్షిస్తుండగా, ఆ ఆదిదంపతులని వేనోళ్ళా కీర్తించారు. సాష్టాంగ నమస్కారాలు చేశారు తాయనారు దంపతులు.  అప్పుడు ఈశ్వరుడు అమృతానంద హృదయుడై , “తాయనారూ ! నీ త్యాగపూరితమైన ప్రేమకి , భక్తికి , నీ నివేదనలకూ ఎంతో  సంతోషించానయ్యా ! నీ భక్తిని ప్రపంచానికి చాటేందుకు ఇలా చేయవలసివచ్చింది.  ఇక మీ దంపతులు ఉండవలసింది భూలోకంలో కాదు . రండి కైలాసానికి వెళదా”మని దగ్గరుండీ స్వయంగా మహేశ్వరుడే ఆ దంపతులని కైలాసానికి తీసుకువెళ్లారు .  అలాగే, అర్ధచంద్రాకారంలోని కొడవలితో తన తలా తీసేసుకోబోయిన తాయనారు ఇక నుండీ మహా శివభక్తుడైన ‘అరివత్త నాయనారు’ గా ప్రసిద్ధిని పొందుతారని ఆశీర్వదించారు.  

ఆ విధంగా అరివత్త నాయనారు త్యజించిన జిహ్వచాపల్యం, ఆకలి మీది ధ్యాస ఆయన్ని పరమాత్మ సన్నిధికి చేర్చాయి. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం అని పెద్దలు చెప్పిన మాటకి తన జీవితమే ఓ ఉదాహరగా చూపి , చివరికి ఈశ్వర సాన్నిధ్యాన్ని పొంది ఆ మాట వరహాల మూటని నిరూపించిన    ‘అరివత్త నాయనారు కథ మనకి ఆదర్శముగా నిలుస్తుందని, ఆ ఈశ్వర కృపకి పాత్రము చేస్తుందని ఆశిస్తూ , ఆవిధంగా అనుగ్రహించమని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధిస్తూ శలవు . 

సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి దివ్యచరణారవిందార్పణమస్తు. 

 

 

Nayanar, Stories, Arivattaya, 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi